సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పేర్కొన్నారు. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 43వ డివిజన్ ప్రతాప్‌నగర్ ప్రాంతంలో జరిగిన సంక్షేమ పథకాల లబ్థిదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి నేరుగా ప్రజలవద్దకు వెళ్ళి ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఆరా తీసి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ… పేద వర్గాలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ… అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలననేదే తమ అభిమతమన్నారు. కుల, మత రాజకీయాలకతీతంగా అర్హతే ప్రాతిపదికగా పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్థిదారుల ప్రదర్శన పలకాన్ని ఎమ్మెల్యేలు అబ్బయ్యచౌదరి, ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం. ఏసుబాబు, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు, తదితరులు పాల్గొన్నారు.

