జిల్లాలో ఖరీఫ్ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు జల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి.ఆర్.ఓ. సీ.హెచ్. సత్తిబాబు, రాష్ట్ర రైతు విభాగపు జోనల్ ఇన్చార్జి కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఓలేటి దాసు, డ్రైనేజీ ఈ.ఈ. కే. ఏడుకొండలు తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో రబీ రెండవ పంట వేసుకోవడానికి అనువైన వాతావరణము ఉందని, అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని రైతులు పంట సాగు చేసుకునే విధంగా ముందుకు రావాలన్నారు.
రబీకి కావలసిన నీటి సదుపాయం ఉందని అవసరమైన మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పూడికతీత పనుల తో పాటు వివిద కాలువ పనుల్లో పంట పండించే రైతులను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. అంతర్వేది పరిసర ప్రాంత రైతుల అవుట్ ఫాల్ స్లుయిజ్ పనులను చేపట్టాలనే రైతుల అభ్యర్థన మేరకు రైతు విభాగ ప్రతినిధులు పరిశీలన అనంతరం కాలువ పూడిక తీత పనులకు కావలసిన నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రైతు విభాగపు సభ్యులు జున్నురి రామారావు, ఆదర్శ రైతు సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరి విత్తనాలు కొనుగోలుకు రైతులు సన్నద్ధం కావాలని… -కలెక్టర్ హిమాన్షు శుక్ల-

