
ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 788 రోజులుగా తమకు న్యాయం చేయమని నినదిస్తున్నారు. అధికారులు ఏ మాత్రం చలించలేదు. కనీసం వారి సమస్య ఏమిటని కూడా అడిగిన సందర్భంలేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చిన్నో చితకో కాంట్రాక్ట్ ఉద్యోగం తమ జీవితాలకు చుక్కానిలా దొరికిందని బ్రతుకు వెల్లదీస్తుండగా పిడుగులాంటి ప్రభుత్వ నిర్ణయం వారిని దిక్కులేని పక్షుల్ని చేసింది. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో గత 788 రోజులుగా న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఎదుట వేసిన దీక్షా శిభిరం (టెంట్) చీకుపోయి చిరిగిపోయింది… అధికారుల మనసు మాత్రం చలించలేదు. వారు పనిచేస్తున్న కాంట్రాక్టు కంపెనీ అనుమతిని రెండేళ్ల క్రితం ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఆప్కాస్ (ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్) లో చేర్చినట్టే చేర్చి ఆనక తొలగించారు. ఆ నేపధ్యంలో కోర్టును ఆశ్రయించారు, కోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. అయినా అధికారులు లెక్కచేయలేదు. ఉద్యోగ వయసు దాటిపోగా, ఉన్న చిన్న ఉద్యగం లేకపోడంతో వారంతా ఆర్ధిక ఇబ్బందుల్లో అద్దెలు కట్టుకోలేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పంధించి వారి సమస్యను పరిష్కరించాల్సిందిగా పలువురు సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.
