రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారని తెలిపారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు నియామకపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపర్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. పార్టీకి, పాలనకు వారధిగా నిలిచేలా వారి సేవలు ఉపయోగించుకుంటామన్నారు. ప్రజా క్షేత్రంలో వీర మహిళలు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరచిపోమనని చెప్పారు. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత అయిదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పదని వారిని కొనియాడారు. మీ మద్దతు ఇలాగే కొనసాగించాలి. కూటమి అభ్యర్ధుల విజయానికి పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు.
పార్టీ మహిళలకు సమగ్ర న్యాయం చేస్తాం… -పవన్ కళ్యాన్-

