లక్కబొమ్మలకు పేరొందిన ఏటికొప్పాకలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారికి ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆ గ్రామంలో ఆయన పర్యటించారు. లక్కబొమ్మల తీర్చిదిద్దడంలో ప్రముఖులు పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజు గారితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం బొమ్మలు తయారు చేసే కళాకారులను కలుసుకొని వారి కళా నైపుణ్యంను ప్రశంసించారు. బొమ్మల తయారీకి కావలసిన ముడి పదార్థాలు, కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు చిన్నాహరి, సత్తిబాబును శాలువాతో సత్కరించారు. అనంతరం బండిమాంబా ఆలయంలో పూజలు నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా హస్తకళారంగంలో రాణిస్తూ లక్కబొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను తీసుకొచ్చిన పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజు హస్తకళా రంగానికి చేస్తున్న సేవలను అభినందించారు. యలమంచిలి ఇంచార్జీ సుందరపు విజయ్ కుమార్, స్థానిక నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

