సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థలమయిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం కార్యకర్తలతో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న దాకలాలు లేవన్నారు.
లక్షలాది మంది మత్స్యకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి వలసపోతున్నారన్నారు. మత్స్యకారులనుంచి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ (ఎన్.ఏ.ఓ.బీ.) నిర్మాణానికి భూమిని సేకరించిందన్నారు. వారికి తగిన నష్టపరిహారంతోపాటు వేరొక ప్రాంతంలో భూమి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిందన్నారు.
కనీసం ఆ ప్రాంతంలో వేటకు వెళ్లడానికి కూడా లేకుండా ఆంక్షలు విధించిందన్నారు. స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమై పశువులు మృత్యువాత పడటంతో యాదవులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు వెంకట సతీష్, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

