ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి నెలకు రు.11వేల ఆర్థిక సహాయంగా ఓ.ఎన్.జి.సి. పదివేల కోట్లు పంపిణీ చేసింది. అయితే తూర్పు తీరం నుండి ఈశాన్యం వైపుగా ఉప్పలంక, కాకినాడ, ఏటిమోగ, దుమ్ములపేట, శంతన పురి కాలనీ మొదలు తీరంలోని సూర్యారావు పేట ఉప్పాడ వరకు వేటపై ఆధారపడి జీవిస్తున్న 25వేల మంది పైబడిన మత్స్యకారుల కు ఎటువంటి ప్రయోజనం ఇవ్వకుండా దశాబ్దన్నర కాలంగా దోపిడీ జరిగిన రాజకీయ మాఫియా వలన ఇక్కడి బడుగులు వెయ్యికోట్ల నష్టపరిహారం కోల్పో యారని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.
మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికైనా గుర్తించడం హర్షదాయకమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఇక్కడి మత్స్యకారులకు లభించాల్సిన ఆర్థిక సహాయం ప్యాకేజీ ఎవరికీ వెళ్ళిందో తెలియాలన్నారు. గుజరాత్ లో గ్యాస్ పెట్రోల్ అక్కడి ప్రజలకు అతి స్వల్ప ధరతో అందుతుండగా తూర్పు తీరంలో ఆ వెసులు బాటు లేకుండా అన్యాయం సాగిస్తూ ఇక్కడి సముద్ర గర్భ సంపదను పైపు లైన్ల ద్వారా తరలించుకు పోవడం అత్యంత దుర్మార్గమన్నారు. సంఘటితంగా కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ ఆధ్వర్యాన ఉద్యమించాలని పేర్కొన్నారు.

