ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల ఉత్తమ సేవలకు గాను వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… జిల్లాలో 11,877 మంది వాలంటీర్లకు సేవా మిత్ర, సేవ రత్నా, సేవా వజ్ర అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సేవా మిత్ర అవార్డు కింద 11,691 మందికి రూ.15 వేల చొప్పున నగదు, ప్రసంశ పత్రం, సాలువ, బ్యాడ్జి, సేవ రత్న కింద 152 మందికి రూ.30 వేల చొప్పున నగదు, ప్రసంశ పత్రం, సాలువ, బ్యాడ్జి, మెడల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సేవా వజ్ర క్రింద జిల్లాలో 34 మందికి రూ.45 వేలతో పాటు ప్రశంస పత్రం, సాలువ, బ్యాడ్జి, మెడల్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

