రాజమండ్రి పర్యటణలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్ధం చేసుకున్నారని తెలిపారు.
కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో సాద్యమయ్యే పని కాదనీ… ఆ ఐక్యత విలువను ఎప్పటికప్పుడు అందరికీ తెలియచెబుతూ రావాలన్నారు. కోనసీమ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భాల్లో అనేక సామాజిక వర్గాలతో మాట్లాడటం, ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులతో కులాల ఐక్యత సాధించడం గురించి మాట్లాడుతూ వచ్చానని తెలిపారు. ఈ రోజు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు ఒకతాటి మీద ఉండి ప్రజలతో మమేకం కావడం ఒక మార్పును సూచిస్తోంది అని చెప్పారు. కాబట్టి కోనసీమలో కులాల మధ్య గొడవలు సృష్టించాలని వై.సీ.పీ. ప్రయత్నించినా సాధ్యం కాలేదు అన్నారు.

