కాకినాడలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఫిబ్రవరి 29వ తేదీన జరిగే మహాధర్న కరపత్రం ఆవిష్కరణ స్థానిక శారద దేవి గుడి వద్ద కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కరపత్రాల ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ది కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తాటిపాక మధు, ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై కరపత్రవిస్కరణ చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందే ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు కావడం లేదని, 2019 తర్వాత ఒక్క రూపాయి కూడా సంక్షేమ బోర్డు నుండి విడుదల చేయలేదని అన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా ఐదు కోట్ల రూపాయలు క్లెయిమ్స్ నిధులు పెండింగ్లో ఉన్నాయని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు నిరాశ కలిగించారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోట్లాది రూపాయల నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తూ భవన నిర్మాణ కార్మికులకు మొండి చేయి చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల కొరకు నిర్మాణరంగంలో సెస్ రూపంలో వసూలు చేస్తున్న నిధులను భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలని డిమెండ్ చేసారు.

