ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎం.డీ.యూ. వాహనాల ద్వారా ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా పంపిణీ చేస్తున నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులో పంపిణీ చేయాలని జే.సీ. సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య వాహనదారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ పట్టణం 1వ వార్డు రమణయ్య పేట, బోట్స్ క్లబ్ ప్రాంతాల్లో ఎం.డీ.యూ. వాహనం ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, పంచదార ఇతర సరుకుల తూకం, ధర, నాణ్యతలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జే.సీ. మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పేద ప్రజలకు నిత్యవసర సరుకులను గడప వద్దకే వచ్చి పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన గడువులోపు సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఈ పర్యటనలో జేసీ, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.వీ. ప్రసాద్, ఎం.ఎస్.ఓ. లు, తదితరులు ఉన్నారు.

