తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 5వ రోజైన సోమవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జనార్దన్, భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ… తాము గత 20 సంవత్సారాలు జి.జి.హెచ్. లో కీలక విభాగమైన శానిటేషన్ లో పని చేస్తున్నామన్నారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు.
ఈ విషయమై చాలా సార్లు అధికారులకు, కాంట్రాక్టు సంస్థ వారికి విన్నవించుకున్నా న్యాయం జరగక పోవడం వల్లనే ఆందోళన చేపట్టామన్నారు. ఈ వారంలో స్పందన లేకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఐక్యంగా పోరాటం సాగిద్దామన్నారు.
సి.ఐ.టి.యు. నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ… కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కొరకు అధికారులు జోక్యం చేసుకోవాలని సి.ఐ.టి.యు. డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు , జె.లక్ష్మీ ప్రియ, ఆర్. రమేష్, జె. శేషు, ఎస్. వాసు, బి. మంగతాయారు, తదితరులు పాల్గొన్నారు.

