కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్.ఎఫ్.సి.ఎల్. లో పెద్ద కుంభకోణం జరుగుతుందని దీనిపై ఈ.డి. సమగ్ర విచారణ జరపాలని మధు డిమాండ్ చేశారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక పి.ఆర్. భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎన్.ఎఫ్.సి.ఎల్., కోరమండల్ పరిశ్రమల వద్ద ఉద్యోగులకు కరపత్రాలు పంచుతూ భవిష్యత్తు ఆందోళనకు మీరందరూ ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… నెల రోజుల్లో కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టుకు వెళ్లి ప్రజావాజ్యం వేస్తామని ఆయన అన్నారు. రెండు రోజుల క్రితం కాకినాడ ఎన్.ఎఫ్.సి.ఎల్. జూ లో ఉన్న జింకలు, దుప్పెలు, తదితర జంతువులను వేరే ప్రాంతాలకు తరలించారన్నారు.
ఇప్పటికే ఆశ్రమ పాఠశాలను రాహుల్ రాజు భార్య వ్యక్తిగత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఇక గ్రీన్ బెల్ట్ 600 ఎకరాలను వ్యక్తిగత పేర్లు మీద గ్రీన్-కో సంస్థకు బదలాయింపులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే. బాడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.ఎస్. నారాయణ, కే. అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
