తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, కేవలం అనుమానంతోనే చేశారని సీఎం తరపు న్యాయవాది వాదించగా, సుప్రీం కోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. నేరం రుజువైతేనే ఒక వ్యక్తిని అరెస్టు చేయవచ్చని అన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45ను ప్రస్తావిస్తూ.. దర్యాప్తు సంస్థ ఢిల్లీ ముఖ్యమంత్రి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని సింఘ్వీ వాదించినట్లు నివేదికలు తెలిపాయి.
అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తన సొంత వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని పేర్కొంది. పి.ఎం.ఎల్.ఎ. లోని సెక్షన్ 50 ప్రకారం అతని స్టేట్మెంట్లు రికార్డ్ చేయలేదని చెప్పడం ద్వారా మీరే విరుద్ధంగా మాట్లాడటం లేదా? సెక్షన్ 50 కింద వాంగ్మూలాల నమోదు కోసం సమన్లకు తొలుత సీ.ఎం. హాజరు కాలేదని, ఇప్పుడు రికార్డు చేయలేదని చెబుతున్నారని కోర్టు పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ తొమ్మిది సమన్లు జారీ చేసినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావడానికి నిరాకరించారు.

