
వైద్యలు కూర్చునేందుకు కుర్చీలు లేవు… మందులు నిల్వ చేసేందుకు వసతి లేదు… లేబరేటరీ ప్రసక్తే లేదు… ఇక ప్రసవాల ప్రస్తావనే లేదు. సిబ్బంది కూర్చోవటానికి ఆవాసం లేదు… రికార్డుల మాట పైవాడెరుగు… పేషెంట్లోస్తే నిలబడే చికిత్స పొందాలి. ఐనా … అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే. దానికీ నిదులొస్తుంటాయి… సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. రెండే రెండు గదుల పాత భవనం అది. అందులో ఒక గది డాక్టర్‌కు, మరొకటి మందులు, రికార్డులకు. ఇద్దరు వైద్యులున్నారు… అయితే ఒకరు వస్తే మరొకరు బయటే ఉండాలి. ఇక సిబ్బంది మాత్రం ఆ భవనానికి ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంకు కింది కుర్చీలు, బల్లలు వేసుకుని రికార్డులు రాసుకోవాలి. అవసరమైన పేషంట్లకు అక్కడే ఇంజక్షన్ ఇవ్వడం. 2018 నుంచి కొత్త పీహెచ్సీ భవన నిర్మాణం స్థంభాల దశలోనే ఉంది. కందికుప్ప, బలుసుతిప్ప, పల్లంకుర్రు పంచాయతీలకు చెందిన 28,000 మంది ప్రజానీకానికి అదే ఆరోగ్య ప్రధాయని. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆ ఆరోగ్య కేంద్రం ఎక్కడుందా …. అనుకుంటున్నారా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయితీలో ఉంది.

పచ్చని పల్లెసీమలో పాముల బెడద కూడా ఎక్కువే. ఎవరికైనా పాము కరిస్తే… 24 గంటల నొప్పి వస్తే… 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మడివరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి గాని, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రేనికోన ఆరోగ్య కేంద్రానికి గాని వెల్లాల్సిందే. డిస్పెన్సరీగా ఉన్నప్పుడు ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఒక చిన్న భవనంలో ఏర్పాటు చేశారు. పెరుగిన జనభా, ఆరోగ్య సేవల అవసరాల నేపధ్యంలో 2011లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. సిబ్బందిని పెంచారు. ఇద్దరు డాక్టర్లను నియమించారు. ఒక ఎంపీహెచ్‌ఇఓ, ఎంపీహెచ్ఎస్(ఎఫ్), ఇద్దరు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఎఫ్ఎన్ఒ, మరొక శానిటరీ అటెండెంట్ పనిచేస్తున్నారు. ఐతే 2011 నుంచి ఇక్కడ పీహెచ్ఎన్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

మందులు, మెడికల్ రికార్డులను భద్రపరిచిన గది గోడలు చెమాయింపుతో పాడవుతున్నాయి. సిబ్బంది కూర్చోవడానికి వీల్లేక పీహెచ్సీ చెంతనే ఉన్న మంచినీళ్ల ట్యాంకు కిందనే కూర్చుంటున్నారు. అక్కడే వారి మెడికల్ రికార్డులకు సంబంధించిన విదులు నిర్వర్తిస్తున్నారు.

నూతన భవనం నిర్మించేందుకు పల్లంకుర్రు పంచాయితీ 2011 లో తీర్మాణం చేసి 0.50 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అందులో సొంత భవనం నిర్మించేందుకు ఏపీఎంఎస్ఐడీసీ రూ.80 లక్షల అంచనాలతో టెండర్ పిలిచింది. 2018లో ఆ నిర్మాణం స్థంభాల దశలోనే నిలిచిపోయింది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిన స్థానిక ఎమ్మెల్యేగాని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖగాని, ఏపీఎంఎస్ఐడీసీగాని ఇప్పటికీ పట్టించుకున్న దాఖలాల్లేవు.
