స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా నాయకుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ. బీ.జే.పీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
ఎస్.బీ.ఐ. జారీ చేసిన ఎన్నికల బాండ్లు విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మార్చి 6 లోపు వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. జూన్ 30 వరకు 116 రోజులు గడువు కావాలని ఎస్.బీ.ఐ. యాజమాన్యం సుప్రీంకోర్టును కోరడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్.బీ.ఐ. యాజమాన్యం కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.
