కాకినాడ నగరంలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణం జరిగిందని సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణలు అన్నారు. రేపు ప్రారంభం కాబోతున్న ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని వీరు సందర్శించి హాస్పటల్లో సౌకర్యాలు, సిబ్బంది, డాక్టర్లు వంటి వాటిని పరిశీలించడం జరిగింది.
ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 30 ఏళ్ల నుంచి సి.ఐ.టి.యు., ఇతర కార్మిక సంఘాలు, వామపక్షాలు ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ కాకినాడలో ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేశాయన్నారు. ఈ పోరాటాల ఫలితమే హాస్పటల్ ఇక్కడికి వచ్చిందని అన్నారు. రేపు ప్రారంభం కాబోతున్న ఈ హాస్పటల్లో అన్ని రకాల సౌకర్యాలు మరియు సిబ్బందిని త్వరితగతిన నియమించే ఏర్పాటు చేసి కార్మికులందరికీ ఈ హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
