పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లాలో పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఏ.పీ. ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్.ఎస్.సీ., ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్టల్, జిల్లా పరిషత్, పోలీస్, రవాణా, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 01 వ తేదీనుంచి 20 వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. అదేవిదంగా 10వ తరగతి పరిక్షలు మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలు, పరీక్ష పత్రాల స్టోరేజ్ పాయింట్లు, పోలీస్ బందోబస్తు, ఆర్.టీ.సీ. బస్సుల ఏర్పాటు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు.
ఈ సమావేశంలో కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డీ. తిప్పే నాయక్, అడిషనల్ ఎస్పీ జే.ఎన్.వీ. భాస్కర రావు, జిల్లా విద్యాశాఖాధికారి పీ. రమేష్, జెడ్పీ సీ.ఈ.వో. ఎ. శ్రీరామ చంద్రమూర్తి, డీ.పీ.వో. కె. భారతి సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

