ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్రనను పోషస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో గోదావరి భవన్ నందు ఏర్పాటు చేసిన పోలీస్ సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు.
రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒక రిటర్నింగ్ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒక సెక్టార్ అధికారికి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందన్నారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు సంక్రమిస్తాయన్నారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్నీ ఎన్నికల ఆదేశాల మేరకు మూడు సార్లు సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని సూచించారు.

