కాకినాడ అభివృద్ధి పేరుతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న దురాగతాలను ఒక్కక్కటీ వెలుగు తీస్తున్నా తరగని అవినీతి కోణాలు అనేకం ఉన్నాయని ద్వారంపూడి అరాచక పాలనపై మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరెళ్ళ కాలంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులు ఏ పాటివో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నిధులనుండి ఒక్క పైసా తీసుకువచ్చే సత్తా ద్వారంపూడికి లేదని, కేవలం తన పదవీ కాలంలో అధికారం అడ్డం పెట్టుకుని నగరపాలక సంస్థను అడ్డుగోలుగా దోచేస్తున్నాడని కొండబాబు ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యే కబ్జా చేయడానికి కనిపించిన పోర్టు భూములు కాకినాడ నగర ప్రజల విద్యుత్ అవసరాల నిమిత్తం సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎందుకు కనిపించలేదని మాజీ ఎమ్మెల్యే వనమాడి ప్రశ్నించారు. వినియోగానికి ఉపయోగపడని ప్రైవేటు భూమిపై రూ.251 కోట్ల టిడిఆర్ బాండ్లను మంజూరు చేయించి ద్వారంపూడి దోచుకున్నాడని కొండబాబు విమర్శించారు.

