ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పారదర్శకమైన, దోష రహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.వో., నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ-2024 లో భాగంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం పై కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6,7,8 ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రగతిని నాగ నరసింహారావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఓటరు ప్రత్యేక శిబిరంలో వచ్చిన దరఖాస్తులను కూడా ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త ఓటర్ల నమోదు, నాన్ ట్రేస్డ్ ఓటర్లకు సంబంధించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన నోటీసుల వివరాలు, మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారాన్ని ఆయన నాయకులకు వివరించారు.

