
ఉద్యోగన్వేషణలో ఉన్న నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలకు అంతేలేకుండా పోతోంది. ఏకంగా రూ.350 కోట్లకు పైనే నిరుద్యోగుల నుంచి క్రిప్టో కరెన్సీ తదితర ఆన్‌లైన్ రూపంలో అకౌంట్‌కు బదిలీ చేయించుకుని దుబాయ్‌లో సొమ్ముగా మార్చుకుంటున్నట్టు అనంతపురం పోలీసులు నిర్ధారించారు. ఒక బాధితుడి ఫిర్యాదు దర్యాప్తులో సైబర్ నేరగాళ్లకు చెందిన 16 ఫేక్ అకౌంట్లను పోలీసులు గుర్తించారు. సుమారు రూ. 35.59 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శుక్రవారం వెల్లడించారు.

ఈ వ్యవహారంలో ఐదుగురు సభ్యులు కలిగిన ఒక సైబర్ నేరగాళ్ల ముఠా పట్టుకున్నారు. ఈ ముఠాలో సైబర్ నేరాలలో ఆరితేరిన కింగ్ పిన్ కోసం అనంత పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఇటీవల నమోదైన సైబర్ నేరంతో తీగ లాగితే డొంక కదలింది. దేశ వ్యాప్తంగా NCRB పోర్టల్ లో 1550 ఫిర్యాదులు నమోదుకాగా వీటి లావాదేవీలు సుమారు రూ.350 కోట్ల పైమాటే అంటున్నారు. ఈ ముఠాలో కీలక వ్యక్తి నుంచి ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కమీషన్ రూపంలో రూ.20 లక్షలు చేరినట్టు గుర్తించారు.

