
పోలీస్ బాస్‌ల బాటలో సిబ్బంది నడుచుకుంటున్నారా… అంటే లేదనే చెప్పక తప్పదు. అందుకు కారణాలు కోకొల్లలు. ఒక్క గంజాయి అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారాన్నే పరిశీలిస్తే… సిబ్బంది తీరు ఆవిషృతమవుతుంది. దట్టమైన విశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి నిషేదిత గంజాయి రవాణా కాకినాడ జిల్లాను దాటుకుని అటు అమలాపురం ఇటు రాజమండ్రితో పాటు విజయవాడ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు చేరుకుంటుంది.

తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, మండలాల మీదిగా ఈ గంజాయి రవాణా గోప్యంగా పలు విధాలుగా గమ్య స్థానాలకు చేకుంటుంది. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు, హైవే పెట్రోలింగ్, ఫారెస్ట్ చెక్‌పోస్టులు, రవాణాశాఖ చెక్‌పోస్ట్‌లు, టోల్గేట్లు ఉన్నప్పటికీ గంజాయి ఎల్లలుదాటి పట్టణాలు, సిటీ గల్లీలకు చేరుకుంటోంది. ఇటీవల 13 అక్టోబర్ 2023న కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో 28 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

విద్యార్థులు, యువకులు ఎక్కువగా ఈ గంజాయికి బానిసలవుతున్న విషయం కాకినాడ సర్పవరం పోలీస్టేషన్లో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా అందులో నలుగురు మైనర్లు ఉండటం ప్రమాద సూచికను తెలియజేస్తోంది. ఇదిలా ఉండగా హైవే పెట్రోలింగ్ వాహనంపై విధులు నిర్వహించే ఎల్లేశ్వరరావు అనే హోమ్ గార్డు 29 నవంబర్ 2021 ఏలూరులో గంజాయి కేసులో పట్టుబడటంతో పోలీసు శాఖలో గంజాయి దొంగల గుట్టు గుప్పుమంది.

పిఠాపురానికి చెందిన నలుగురు గంజాయి రవాణాదారులను తమిళనాడు ఎన్సీబీ పోలీసులు 438.400 కేజీల గంజాయితో 15 ఫిబ్రవరి 2023న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి పిఠాపురం అడ్డాగా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నా… అక్కడి పోలీసులు ఏమి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైళ్లలో గంజాయి భారీగా రవాణా జరుగుతుండటం విశ్మయానికి గురిచేస్తోంది. కాకినాడ నుంచి షేషాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 120 కేజీల గంజాయి రవాణా అవుతుండగా ఒంగోళు రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

