
ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కాకినాడ ప్రభుత్వ సామాన్య హాస్పిటల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏఐటీయూసీ 14వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాంచ్ అధ్యక్షుడు కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సోంబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబైలో ఏర్పడిందని, నేడు 104 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం అంటే కార్మికుల హక్కుల పరిరక్షణకు ఇప్పటికీ కంకణబద్దులై ఉన్నామనే సంకేతమన్నారు. కార్మిక చట్టాల అమలు, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీ పనిచేస్తోందన్నారు.
కాకినాడ ప్రభుత్వ సామాన్య హాస్పిటల్ లో సిబ్బంది కొరత ఉందని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌కి తెలియజేశామన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతన రూ. 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి. స్వామి బాబు, జిల్లా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కాకినాడ హాస్పిటల్ యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

