ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జల వనరుల శాఖతో సమీక్షించాలి.
ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ పంట కాలువ చూసినా పూడిక చేరిపోయి, తుప్పలు, తూటి కాడలు పెరిగిపోయి ఉన్నాయన్నారు. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదన్నారు.
గత యేడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఓ కారణమయిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా రైతాంగం నుంచి ఈ సమస్యపైనే ఎక్కువ విజ్ఞాపనలు వచ్చాయన్నారు. జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకీ, లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి. రుతు పవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతాంగానికి మేలు జరుగుతుందని అన్నారు.
