లోక్‌సభ టికెట్ నిరాకరించినందుకు ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎం.పీ. గణేశమూర్తి కొద్ది రోజుల తర్వాత గురువారం ఉదయం కోయంబత్తూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు స్పందించకుండా మరణించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎం.డి.ఎం.కే. పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో పురుగుమందు తాగినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ కె.ఎమ్.సి.హెచ్ వైద్యులు గురువారం తెల్లవారుజామున 5.05 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఈరోడ్‌లోని పెరుందురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో ఆయన మరణించారని నివేదికలు చెబుతున్నాయి.
ఎం.డి.ఎం.కే. లోని సీనియర్ నాయకులలో ఒకరైన గణేశమూర్తి 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీ.ఎం.కే. ఉదయించే సూర్యుడి గుర్తు పై ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాబోయే ఎన్నికల కోసం పార్టీ తనను తిరస్కరించడంతో అతను నిరాశకు గురయ్యాడు. తీవ్ర ఒత్తిడికి గురైన గణేష్‌మూర్తి మార్చి 24 ఈరోడ్‌లోని తన నివాసంలో పురుగుమందు తాగారు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కేఎంసిహెచ్కి తరలించారు. ఇక్కడ గురువారం ఉదయం మృతి చెందాడు.
