జనసేన పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సార్వత్రిక ఎన్నికలో వీర మహిళలు క్రియాశీలక పాత్ర తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా శనివారం పార్టీ పీ.ఏ.సీ., రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల సాధికారతకు సంబంధించిన పథకాలు, వారి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు కావడం లేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2029 నుంచి 33శాతం రిజర్వేషన్లు తీసుకురావడం మూలంగా మహిళల్లో మరింత రాజకీయ చైతన్యం వస్తుందని అన్నారు. అప్పటికల్లా మన వీర మహిళలు మరింత శక్తిమంతం కావాలని సూచించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీతో కలసి నడుస్తున్న వీర మహిళలు చురుగ్గా బాధ్యతలు చేపట్టాలన్నారు.
