ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ వర్కర్లు యూనియన్ సి.ఐ.టి.యు. పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ద్వారా జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించుకుంటున్న పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, తదిర అంశాల డిమాండ్లపై గురువారం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది.
బుధవారం తెల్లవారుజామునుండే సచివాలయ పోలీసులు ద్వారా ఆశల ఇళ్లకు వెళ్లి ఆటోలు ద్వారా స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో సొంత వాహనాలు పెట్టుకుని వెళ్తున్న ఆశలను సైతం నిర్బంధించారు. ఉదయం ఏడు గంటలకు అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ మండపాల్లో, పోలీస్ స్టేషన్లో విజయవాడ వెళ్లే ట్రైన్స్ అన్ని వెళ్లిపోయేదాకా నిర్బంధించారు.
అర్ధరాత్రి టికెట్టు కొనుక్కుని ఆర్టీసీ బస్సులు ఎక్కిన ఆశాలను సైతం ప్రయాణ మార్గాలలో రామచంద్రాపురం, ఏలూరు, వడ్డేశ్వరం వద్ద బలవంతంగా బస్సుల నుండి దింపి స్థానిక స్టేషన్లకు తరలించారు. జిల్లాలో సామర్లకోట, పెద్దాపురం, తుని, పిఠాపురం, కాకినాడ వన్ టౌన్, 3 టౌన్ తాళ్ళరేవు పోలీస్ స్టేషన్లు, జిల్లా పరిషత్తు కళ్యాణమండపాలు ఆశాలతో కిక్కిరిపోయాయి.

