2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎన్జిసి బాధితుల పోరాట శిబిరం వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముత్తా హాజరై మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఓఎన్‌జీసీ నష్టపరిహారం అందజేస్తుందని, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటిమొగ మత్స్యకారులకు మొండిచేయి చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
