పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీ. ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అందుకు సంబందించి అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరబాట్లు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది అనుభవాలతో ఈసారి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా సెల్ ఫోన్లు తీసుకురాకుడదని నిర్ణయిoచడం జరిగిందన్నారు.
జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయాలని సూచిస్తూ, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు. పరీక్ష కేంద్రం లోకి సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, కెమెరా లు, ఇతర ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమంతించబడవన్నా రు.

