లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సీ.పీ.ఎం. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా రక్షణ భేరి యాత్రను జయప్రదం చేయాలని సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జి, కె.ఎస్. శ్రీనివాస్, జి. బేబీ రాణి తదితరులుతో కలిసి పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… బీజేపీ పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. బిబీజేపీ బుల్డోజర్ రాజకీయాలతో అన్నదమ్ముల సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రాజేస్తుందన్నారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
స్త్రీలను నగ్నంగా నడిరోడ్డు మీద ఊరేగించి అదేదో తమ ఘనతగా మోడీ ప్రభుత్వం విర్రవీగుతుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు కావస్తున్న విభజన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామయ్యపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ ఏర్పాటు వంటి ఏ ఒక్క హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రజలు తమ కష్టం గురించి చెప్పుకోవాలంటే వినడానికి ముఖ్యమంత్రికి ఒక్కరోజు కూడా తీరిక లేదన్నారు. ఎంతసేపూ నవరత్నాల గురించి తప్ప పెరిగే ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతివృత్తులు, కౌలురైతులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి పల్లెత్తుమాట అనకపోగా, పార్లమెంట్లో బిజెపిని బలపరుస్తోందన్నారు.
సీ.పీ.ఎం. రక్షణ బేరి యాత్రను జయప్రదం చేయాలి… సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ పిలుపు

