అయిపోయింది.. అనుకున్న అంతా అయిపోయింది.. చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్‌ను, రూ.370 కోట్లకు తాకట్టు పెట్టేసాడు. సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టటం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టటమే అని నారా లోకేశ్ అన్నారు. గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని 12.5లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యానని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ను అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వై.సి.పి. మేధావులు దీనికేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఏ.పీ. సచివాలయాన్ని రూ. 370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అన్పిస్తోందన్నారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనాకేంద్రాన్ని తాకట్టుపెట్టలేదని అన్నారు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదని అన్నారు.

