కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి తాడి దుర్గా నాని (9) కిడ్నాప్ గురయ్యాడు. పాఠశాల తరగతి గది నుండే ఆగంతకులు విద్యార్థి బంధువులు అని చెప్పి దుర్గా నానిని కిడ్నాప్ చేశారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఆగంతకులు ఫోన్ చేసి నాలుగు లక్షలు డిమాండ్ చేస్తూ ఆ సొమ్ము ఇవ్వకపోతే మీ అబ్బాయిని చంపివేస్తామని బెదిరించారు. కిడ్నాప్ కి గురైన విద్యార్థి తల్లిదండ్రులు రమేష్, మరియలు అందించిన వివరాలు ప్రకారం వారి కుమారుడు దుర్గా నాని ప్రతిరోజు మాదిరిగానే స్థానిక నీలమ్మ చెరువు వద్ద గల ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాలకు వెళ్లాడు. మూడో తరగతి చదువుతున్న దుర్గా నాని తరగతి గదిలోనికి గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ ధరించి, బూట్లు ధరించి ఉండి దుర్గా నాని అమ్మమ్మకు ఆరోగ్యం బాగోని కారణంగా విద్యార్ధిని తీసుకు వెళుతున్నామని, తాను విద్యార్థి బంధువునని ఉపాధ్యాయులకు నమ్మబలికించాడు. దానితో విద్యార్థి సైతం అతను మాటలు నమ్మడంతో తరగతి లోని ఉపాధ్యాయులు వచ్చిన వ్యక్తి నుంచి సంతకం తీసుకొని దుర్గా నానిని అతనితో పంపించారు.
తదుపరి 4 గంటల సమయంలో ఆగంతకులు విద్యార్థి తండ్రి అయిన రమేష్ కు ఫోన్ చేసి నాలుగు లక్షల రూపాయలు ఇస్తే నే మీ కుమారుదును వదిలిపెడతామని, లేదంటే చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు. ఆగంతకులు నాలుగు లక్షలు రూపాయలు డిమాండ్ చేయడంతో వ్యవసాయ కూలీ గా కుటుంబాన్ని పోషించుకుంటున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక కౌన్సిలర్ నేతల హరిబాబు, ఏడవ సచివాలయ కన్వీనర్ నేతల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ దారుల నుంచి వచ్చిన ఫోన్ నెంబర్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తే “నేనెవరో మీకెందుకు మీరెవరో చెప్పాలి” అనే పేరుతో “ట్రూ కాలర్” లో ఫీడ్ అయి ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది*.

