తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… చాలా కాలంగా జి.జి.హెచ్. లో శానిటేషన్ వర్కర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండే మినహాయిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో సహా అధికారులందరికీ వినతి పత్రాలు సమర్పించినా న్యాయం జరగలేదన్నారు. తాము ఆందోళన చేస్తే రోగులకు చాలా ఇబ్బంది కలుగుతుందని, సమస్యలు పరిష్కరిస్తారని వేచి చూసామన్నారు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగాయని అందువల్ల కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరుతున్నామన్నారు.

