ఆర్యవైశ్య కుల ద్రోహిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చరిత్రలో నిలిచిపోయాడని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వాసవీ సేవా సమితి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన వనభోజనాలకు అనుమతి లేదంటూ పోలీసులతో మంత్రి వెల్లంపల్లి అడ్డుకోవడం పై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వం నిర్వహించిన వనభోజనాలకు లేని అనుమతులు ఆర్యవైశ్యులు జరుపుకునే వన సమారాధనలకు , పూజలకు ఎందుకంటూ ధ్వజమెత్తారనన్నారు.
సమాజానికి మంచి చేయటం, ఆపన్నులకు, అన్నార్తులకు సేవ చేయటం మినహా అపకారం అంటే ఏమిటో ఆర్య వైశ్యులకు తెలియదన్నారు. అటువంటి వైశ్య సమాజంపై వై.సీ.పీ. ప్రభుత్వం ఎందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో అర్ధం కావటం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఘోర అవమానాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి ఎక్కడినుంచి వచ్చాడో మరచిపోయాడంటూ దుయ్యబట్టారు. వనం విడిచిన కోతీ కులాన్ని మరిచిన మనిషి ఎందుకూ కొరగాడన్న విషయం వెల్లంపల్లి గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.

