మూడు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం అధికార వైసీపీకి నచ్చక వారు రకరకాలుగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొత్తులను చెడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా కూటమి పొత్తులకు నష్టం కలిగించే పనులు చేయ్యకూడడని తెలిపారు.
కచ్చితంగా కొన్ని రోజులుపాటు వై.సీ.పీ. సోషల్ మీడియా చేసే తప్పుడు ప్రచారంపై అందరూ అప్రమత్తంగా ఉండి వ్యవహరించాలని అన్నారు. ప్రజాగళం సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రజలకు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. మూడు పార్టీలు పొత్తులోకి వచ్చిన తర్వాత జరిగిన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇక వై.సీ.పీ. కి టైం అయిపోయింది.. కొత్త ప్రభుత్వం రాబోతోందని అన్నారు.
