సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు , దేవాలయం వీధి, కలెక్టరేట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాకినాడ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎం.చంటిబాబు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ తో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కెల్ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాలలో ఉద్యోగులకు అమలవుతున్న హెచ్ఆర్ పాలసీని సమగ్రశిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధికారులు చర్చలు పేరుతో కాలయాపన చేయడాన్ని మానుకోవాలని హితవుపలికారు. అనకాపల్లిలో జగన్ ప్రభుత్వం బలి తీసుకున్న సమగ్రశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఎంతమంది ప్రాణాలు బలితీసుకుంటారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

