వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్ పోటీ చేస్తారని వారి కేబినెట్ సహోద్యోగి ప్రహ్లాద్ జోషి వెళ్లడించారు. ఆయన ధార్వాడ్‌లో మీడియాతో మాట్లాడుతూ… వారిలో ఎవరైనా కర్ణాటక నుండి పోటీ చేయాలా… లేదా ఇద్దరూ బయటి నుండి పోటీ చేయాలా అనే దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
2019లో బెంగుళూరులోని మూడు స్థానాలను బీ.జే.పీ. గెలుచుకున్నందున జైశంకర్ లేదా సీతారామన్ బెంగళూరు నుండి పోటీ చేస్తారని తరచుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మదురైలో జన్మించిన ఆమె జనవరిలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముందు తమిళనాడులో పర్యటించి కాంచీపురం నుండి వేడుకను వీక్షించారు. బెంగళూరులో తన ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన జైశంకర్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ తరపున చురుకుగా ప్రచారం చేశారు.
బీ.జే.పీ. వర్గాల్లో ఊహాగానాల ప్రకారం ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలకు పోటీ చేయడానికి మార్గం సుగమం చేయడానికి పార్టీ అతన్ని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు. చంద్రశేఖర్ గతంలో బెంగళూరు కేంద్రీకృత ప్రచారాలకు మద్దతు ఇచ్చాడు. అయితే కేరళ రాజధాని నుండి పోటీ చేయమని నాయకత్వం అతన్ని కోరవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

