రైలు ప్రమాదం లో గాయపడిన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి సర్వజన ఆసుపత్రి లో బాధితులకు స్వయంగా కోటి 2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి బాధితుని వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారాన్ని అందజేస్తున్నాని చెప్పి, పూర్తిగా కోలుకున్న తర్వాతనే వైద్యుల సలహా మేరకు ఇంటికి వెళ్ళాలని చైర్మన్ తెలిపారు. మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారని అన్నారు.
అనంతరం చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మీడియా తో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటకాపల్లి రైలు ప్రమాద దుర్ఘటనకు గురైన మృతుల కుటుంబాలకు, క్షత గాత్రులకు 2 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ప్రత్యక్షంగా బాధితులను, వారి బాధలను చూసిన మీదట గాయాలను బట్టి 3 కేటగరీ లుగా చేసి పరిహారం మొత్తాన్ని పెంచారని చైర్మన్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం పొందిన వారికి రూ.10 లక్షలు పరిహారాన్ని ప్రకటించారని, అదేవిధంగా గాయపడ్డ వారిలో నెల రోజుల్లోపు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారికి రూ .2 లక్షలు ఇవ్వాలని ఆదేశించారని , నెల రోజులకు పైగా ఆసుపత్రిలో ఉంచి వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉన్న వారికి రూ.5 లక్షలు పరిహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
ఈ విధంగా జిల్లాలో 3 వ కేటగరీ క్రింద 10 లక్షల పరిహారంకు అర్హతగల 3 మందిని, 2 వ కేటగరీ క్రింద 5 లక్షల పరిహారానకి 10 మందిని, 1 వ కేటగరీ క్రింద 2 లక్షల పరిహారానికి 11 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ మేరకు మంగళవారం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు ఒక కోటి 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మరో 30 లక్షల రూపాయలను వేర్వేరు ఆసుపత్రులలో ఉన్న బాధితులకు అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా మృతి చెందిన 13 మందికి వారి ఖాతాలలో నేరుగా కోటి 30 లక్షల రూపాయలను జమ చేసినట్లు తెలిపారు.

