రాష్ట్ర వ్యాప్తంగా వి.వో.ఏ. మూడు సంవత్సరాల కాల పరిమితి 64 జీవోలు సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే తప్పని పరిస్థితిలో సమ్మెలోకి వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్పీలు యానిమేటర్ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు.
రాజమండ్రిలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం యూనియన్ అధ్యక్షురాలు ఎం. శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపాక మధు, ఎం. శ్రీదేవి మాట్లాడుతూ… ఎలాంటి వేతనాలు లేకుండా ఏళ్ల తరబడి సంఘాల ఏర్పాటుకు అభివృద్ధికి రాత్రి పగలు శ్రమ చేసిన మూడు సంవత్సరాల కాలపరిమితి విధించి తొలగించాలని నిర్ణయించడం అన్యాయం అన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పేదరికాన్ని నిర్మూలించాలి కానీ… యానిమేటర్ లను నిర్మూలించడం అన్యాయమన్నారు. వి.వో.ఏ. ల మెడ్జ్ చేయడం వలన వేలాది మంది వి.వో.ఏ. లకు ఉపాధి పోతుందన్నారు. ఉపాధికి నష్టం లేకుండా ఎక్కువ సంఘాలు ఉన్న తక్కువ సంఘాలున్న సర్దుబాటు చేయాలని ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని వారు కోరారు.
