దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయినా నేటికీ మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంపై పాలక ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు మార్చి 7వ తేదీన రావులపాలెంలో మాదిగ రాజకీయ చైతన్య మహాసభ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కేవలం ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మొత్తం మాదిగలను ఓటు యంత్రాలుగా వాడుకోవడం దారుణం అన్నారు.
మాదిగల్లో రాజకీయం పట్ల అవగాహన కల్పించి మాదిగలు అత్యధికంగా ఉన్న పి. గన్నవరంలో తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జంగి సుధాకర్ మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీలకు మాత్రమే మాదిగల మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విపత్తి రత్నకుమార్, యార్లగడ్డ వరప్రసాద్, ఎం. రాజు, శ్రీకాంత్ దలై, బండి యాదగిరి, తదితరులు ఉన్నారు.
