కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ నాలుగోసారి ఎన్నికల బరిలో సిద్దమయ్యారు. గతంలో మూడు సార్లు వరుస పరాభవాలతో విసుగెత్తిపోయిన ఆయన ఫాలోవర్స్ మరోసారి ఆయన వెనుక నడిచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2019లో ఓటమిపాలవడంతో ఇక రాజకీయ సన్యాసం మంచిదని అతని సహచరులే చెప్పడం అప్పట్లో కాకినాడలో హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చలమలశెట్టి సునీల్ పేరును తెలియని వారుండరు. ఎన్ ఆర్ ఐ గా, వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడే . 2009 లో జరిగిన ఎన్నికల్లో సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ (పీ ఆర్ పీ ) తరపున పోటీ చేసారు. చిరంజీవి సామజిక వర్గానికి చెందిన సునీల్ సహజంగానే ఆ పార్టీలో టికెట్ పొంది కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ లో నిలిచారు. కాగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం ఎం పల్లంరాజు 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారిగా చలమలశెట్టి సునీల్ ఓటమిని చవిచూశారు.
రెండవసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని సంకల్పించిన సునీల్ వై ఎస్ ఆర్ సీ పార్టీలో చేరి 2014 లో మరోసారి కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు . 2013 లో జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటికి రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబు వైపు రాష్ట్ర ప్రజలు మొగ్గుచూపుతున్న తరుణంలో సునీల్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున పోటీకి దిగడంతో ప్రత్యర్థి టి డి పీ అభ్యర్థి తోట నరసింహం గెలుపు సాధ్యమైంది. అనుకున్నది ఒకటి , జరిగింది మరొకటి కావడంతో రెండవసారి పరాజయం తప్పలేదు.
మూడోసారైనా గెలుపొందాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరేందుకు మొగ్గు చూపించారు. కాగా గెలుపు పై అతని అనుయాయులు సందేహాలు వ్యక్తం చేయడంతో మూడోసారి మరో పార్టీకి మారారు. తెలుగు దేశం పార్టీలో గెలుపు ఆకాంక్షించిన చలమలశెట్టి సునీల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఆ పార్టీలో చేరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యర్థి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వంగా గీత పై 25,738 ఓట్ల తేడాతో మూడోసారి ఓటమిపాలయ్యారు.
ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇంచార్జిగా నియమించి, కాకినాడ పార్లమెంటరీ ఇంచార్జిగా చలమలశెట్టి సునీల్ ను నియమిస్తూ వైఎస్ఆర్సీ పార్టీ ఐదవ జాబితాను పార్టీ అధినాయకత్వం 31 జనవరిన విడుదల చేసింది. అయితే నాలుగోసారి ఆయన రాజకీయ భవితవ్యంపై చలోక్తులు విరివిగానే వినవస్తున్నాయి.

