కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పడిన చమురు గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికితీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీల బృందం జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. చమురు గ్యాస్ నిక్షేపాల కోసం సముద్ర గర్భంలో ప్రతిపాదించిన సీ.సీ. మిక్ సర్వే కారణంగా కాకినాడ మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.
ఈ సర్వే జరిగే సమయంలో కాకినాడ మూడు దిక్కుల 500 చదరపు కిలోమీటర్ పరిధిలో మత్స్యకారులు వేటకు వెళ్ళనివ్వకుండా నియంత్రించాలని ఇప్పటికే ఓ.ఎన్.జీ.సీ. సంస్థ మత్స్యకారులకు లేఖ ఇచ్చిందన్నారు. సముద్రన్నే నమ్ముకున్న మత్స్యకారులు వారి జీవన ఉపాధి దెబ్బతింటుందని వారన్నారు. ఇలాంటి సమయంలో మత్స్యకారులకు నష్ట పరిహారం అందజేయాలని వారన్నారు. మత్స్యకారు కుటుంబాలకు న్యాయం చేయకపోయినా, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటా దక్కక పోయినా ఒక్క పైపులైను పనులు ప్రారంభం కాకుండా అఖిలపక్ష అధ్వర్యంలో అడ్డుకుంటామని మధు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార సంఘం జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్, పిసిసి మెంబర్ ఆకుల వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, తదితరులు పాల్గొన్నారు.

