రాజకీయ లబ్ధి కోసం రాముడి పేరును బీ.జే.పీ. వాడుకుంటోందని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాషాయ పార్టీ సభ్యులను, నాయకులను నకిలీ హిందువులని అన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్‌లో జరిగిన రోడ్‌షోల్లో సీ.ఎం. పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీజేపీ దృష్టిలో దేవుడు ఓట్ల కోసం, రాముడు సీట్ల కోసం నిలుస్తాడని విమర్శించారు. కానీ మనకు రాముడు రాముడేనని అన్నారు.
అయోధ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు అక్షింతలు పంచి బీ.జే.పీ. నాయకులు రాముడిని అవమానించారని, మోసం చేశారన్నారు. రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యంలో పసుపు పొడి కలిపి అక్షింతలుగా పంపిణీ చేశారని అన్నారు. భద్రాచలం రామచంద్ర స్వామి పేరు చెప్పుకుని ప్రమాణం చేసి నిజమైన అక్షింతలు పంచారని చెప్పాలని బీ.జే.పీ. నేతలకు సవాల్ చేసారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీ.జే.పీ. కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

