ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీహార్ ప్రభుత్వం విధించిన 65 శాతం రిజర్వేషన్ పరిమితిని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను 50% నుంచి 65%కి పెంచడాన్ని రాజ్యాంగబద్ధంగా సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై మార్చిలో హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
గౌరవ్ కుమార్, ఇతరులు దాఖలు చేసిన 10 రిట్ పిటిషన్లపై మారథాన్ విచారణను ముగిస్తూ చీఫ్ జస్టిస్ కే. వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. రిజర్వేషన్ చట్టాల్లో చేసిన సవరణల రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్లు సవాలు చేశారు. నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం సవరించిన రిజర్వేషన్ చట్టాలను నోటిఫై చేసింది.

