రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలందరూ పూర్తి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 168వ రోజు కొవ్వూరు రూరల్ ఆరికిరేవుల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో హోంమంత్రి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమం చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ… వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
దీనిలో భాగంగా ఆరికరేవుల గ్రామ పెద్దల నుంచి వచ్చిన వినతులపై హోంమంత్రి స్పందిస్తూ గోదావరి నదీ తీరాన శ్మశాన వాటిక, పిల్లలకు ఆట స్థలం కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, చిన్న నాగమణి దంపతుల కుమారుడు మారిశెట్టి వెంకన్న (27) మంచంపై ఉన్న దీనస్థితిని చూసి హోంమంత్రి చలించిపోయారు. ఆ యువకుడికి దివ్యాంగుల పెన్షన్ క్రింద వస్తున్న 3 వేల రూపాయల పెన్షన్ ను వెంటనే 5 వేల రూపాయల పెన్షన్ అందేలా చూడాలని అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

