జనం ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై ఉక్కు సత్యాగ్రహం సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు పీ. సత్యారెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కాకినాడలోని స్థానిక హోటల్లో విలేకరులతో సత్యారెడ్డి మాట్లాడారు. సీ.ఎం. జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం అడుగుతున్నా వందలాది మంది పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రయివేటికరణకే మొగ్గు చూపుతోందని చెప్పారు. గత వేయి రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నా ప్రయివేటీకరణకు ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. ఈ సినిమాలో గద్దర్ నాలుగు పాటలు, గోరటి వెంకన్న మూడు పాటలు రాసారని సత్యారెడ్డి చెప్పారు. ప్రజలను చైతన్యం చేసేందుకు సినిమా నిర్మాణం చేశామన్నారు. గద్దర్ మాటలు, పాటలను రాసారని ఆయనకు ఈ సినిమా అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలు మార్చుకుంటుందనే ఉద్దేశ్యంతో సినిమా నిర్మించామని తెలిపారు. విశాఖ ఎం.పీ. ఎమ్వివి సత్యనారాయణ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, పోరాట సమితి జేఏసీ నేతలు, ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేకించే ప్రముఖ వ్యక్తులు, స్థానిక ప్రజలు, కార్మికులు నటించారని తెలిపారు. డిసెంబరు రెండవ వారంలో ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తామని సత్యా రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఉద్యమకారిణి, వైసీపీ నేత అడ్డాల శ్రీలక్ష్మి, ఆదిరాల జక్కరయ్య, అల్లి దావీదు, దాసరి అన్నారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలలో చైతన్యం నింపే దిశగా సినిమా నిర్మాణం… -దర్శకుడు పీ. సత్యారెడ్డి-

