పోలవరం సాగునీటి ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. జులై 27న న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచనుంది. నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదన పెట్టడానికి క్యాబినెట్ తీర్మానం తప్పనిసరి.
కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపేందుకు మంత్రి మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఏ.పీ. శాసన సభ నాలుగో రోజు కార్యక్రమాలు ముగియగానే ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయానికి చేరుకున్నారు. గత నెలలో పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతిన్నదని స్పష్టం చేసింది.

