జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన తెలిపారు. ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని… అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు.
మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్ళేలా షెడ్యూల్ ఉండాలని స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్ళిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకొంటారని తెలిపారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయనున్నట్లు సమాచారం. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. ఆరోజు నుంచి మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారని చెప్పారు.

