రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం దిగజారుతుండటం పట్ల బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ మీడియా జిల్లా ప్యానలిస్టు శ్రీ దువ్వూరి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్లకు ఒక లేఖ రాశారు. బీజేపీ సీనియర్ నేత పొనుగుపాటి చిన్న సుబ్బారావు కూడా ఈ లేక పై సంతకం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం సంవత్సర సంవత్సరానికి పడిపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేటు పాఠశాలలకు తరలిపోతున్నారని గత విద్యా సంవత్సరంలో సుమారు 86 వేలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేటు పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా దువ్వూరి ఆ లేఖలో వివరించారు. నాడు-నేడు మనబడి వంటి కార్యక్రమాలు ప్రకటించినప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా అద్భుతాలు సాధిస్తామని ప్రకటించిన ప్రభుత్వం లక్ష్యాలు సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.
2009లో ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 30:1, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 35: 1 నిష్పత్తిలో విద్యార్థులు ఉపాధ్యాయులు సంఖ్య ఉండాలనే వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, విద్యార్థుల సంఖ్య స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో పాఠశాలల పనితీరును పర్యవేక్షించాల్సిన డిఈఓ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా ఇన్చార్జి డిఈఓ లు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారని వ వార్తలు పత్రికల్లో చూస్తున్నామని ఇది ఆందోళనకరమైన అంశం అని ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణం ఉపాధ్యాయుల నియామకంపై దృష్టిని పెట్టి రానున్న సంవత్సరాల్లోనైనా ఉత్తీర్ణత శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని దువ్వూరి డిమాండ్ చేశారు.
పదవ తరగతిలో పడిపోతున్న ఉత్తీర్ణత- టీచర్ల కొరతే కారణం…. బీజేపీ ఆరోపణ

